గోంగూర పులిహోర

కావలసినవి:
బియ్యం: 2 కప్పులు, గోంగూర: ఆరు కట్టలు(సన్నవి), ఎండుమిర్చి: నాలుగు, పచ్చిమిర్చి: ఆరు, పసుపు: టీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, ఇంగువ: పావుటీస్పూను, కరివేపాకు: కట్ట, సెనగపప్పు: టేబుల్‌స్పూను, మినప్పప్పు: 2 టీస్పూన్లు, ఆవాలు: అరటీస్పూను, మెంతులు: పావుటీస్పూను, జీడిపప్పు: 2 టేబుల్‌స్పూన్లు, పల్లీలు: 2 టేబుల్‌స్పూన్లు, నూనె: 3 టేబుల్‌స్పూన్లు
తయారుచేసే విధానం:
*గోంగూర ఆకుల్ని తుంచి శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి. ఓ బాణలిలో టేబుల్‌స్పూను నూనె వేసి కాగాక తరిగిన గోంగూర వేసి బాగా వేయించాలి. తరవాత ఓసారి గరిటెతోగానీ మిక్సీలో వేసిగానీ మెత్తగా చేయాలి.
* బియ్యం కడిగి ఉడికించి చల్లార్చాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక జీడిపప్పు ఓ నిమిషం వేయించి తీయాలి. తరవాత పచ్చిసెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఇంగువ, మెంతులు, ఆవాలు, కరివేపాకు అన్నీ వేసి వేగాక సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసి దించాలి. ఇప్పుడు కాస్త చల్లారిన అన్నంలో గోంగూర ముద్ద వేసి బాగా కలపాలి. తరవాత తాలింపు వేసి బాగా కలిపి సుమారు గంట తరవాత వడ్డించాలి.