మష్రూమ్స్మంచూరియా – Mushroom manchurian

కావల్సినవి:
పిండికోసం:
బటన్ మష్రూమ్స్ – పావుకేజీ, మైదా – ముప్పావుకప్పు, మొక్కజొన్నపిండి – పావుకప్పు, కారం – అరచెంచా, వెల్లుల్లి తరుగు – చెంచా, ఉప్పు – తగినంత, నీళ్లు – పిండి కలిపేందుకు, నూనె – వేయించేందుకు సరిపడా.
మంచూరియా మసాలా కోసం:
నూనె – రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం,వెల్లుల్లి తరుగు – అరటేబుల్‌స్పూను చొప్పున, క్యాప్సికం, ఉల్లిపాయ – ఒక్కోటి చొప్పున, సోయా సాస్ – రెండు టేబుల్‌స్పూన్లు, చిల్లీసాస్ – టేబుల్‌స్పూను, కారం – అరచెంచా, మిరియాలపొడి – పావుచెంచా, ఉప్పు – తగినంత, ఉల్లికాడల తరుగు – కొద్దిగా.
తయారుచేసే విధానం:
పుట్టగొడుగుల్ని కడిగి, తుడిచి పెట్టుకోవాలి. పిండికోసం తీసుకున్న పదార్థాల్లో నూనె తప్ప మిగిలినవన్నీ ఓ గిన్నెలోకి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమం దోశపిండిలా ఉండాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసుకోవాలి. ఒక పుట్టగొడుగును తీసుకుని ఈ పిండిలో ముంచి, కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేగాక తీసుకోవాలి. ఇప్పుడు మంచూరియా మసాలా తయారు చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి పొయ్యిమీద పెట్టాలి. అది వేడయ్యాక ఉల్లిపాయ, క్యాప్సికం ముక్కలు వేయాలి. రెండు నిమిషాలయ్యాక అల్లంవెల్లుల్లి తరుగు వేయాలి. అవి కాస్త వేగాయనుకున్నాక కారం, సోయా, చిల్లీసాస్, కొద్దిగా ఉప్పూ, మిరియాలపొడి వేసి పెద్దమంటపై వేయించాలి. ఇందులో ముందుగా వేయించుకున్న పుట్టగొడుగు ముక్కల్ని వేసి బాగా కలిపి దింపేసి ఉల్లికాడల తరుగు వేస్తే చాలు.