హైదరాబాదీ వెజ్ బిర్యానీ – Hyderabadi vegbiryani

కావలసినవి:
బాస్మతి బియ్యం: ఒకటిన్నర కప్పులు, కుంకుమపువ్వు: కొద్దిగా, పాలు: అరకప్పు, నూనె: సరిపడా, ఉల్లిముక్కలు (సన్నగా పొడవుగా తరిగినవి): ఒకటిన్నర కప్పులు, జీడిపప్పు:2 టేబుల్ స్పూన్లు, బాదం: 2 టేబుల్‌స్పూన్లు, ఎండుద్రాక్ష: 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి: అరకప్పు, లవంగాలు: నాలుగు, నల్లయాలకులు: రెండు, పలావు ఆకులు: రెండు, ఉల్లిముక్కలు (చిన్నముక్కలుగా తరిగినవి): ముప్పావు కప్పు, అల్లంవెల్లుల్లి: టేబుల్‌స్పూను, పుదీనా ముద్ద: అరకప్పు, కొత్తిమీర ముద్ద: పావుకప్పు, బిర్యానీ మసాలా: 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు: రుచికి సరిపడా, బంగాళాదుంప ముక్కలు: ముప్పావు కప్పు, క్యారెట్ ముక్కలు: ముప్పావు కప్పు, కాలీఫ్లవర్ ముక్కలు:పావుకప్పు, బీన్స్ ముక్కలు: పావు కప్పు, తాజా మీగడ: 2 టేబుల్‌స్పూన్లు, పెరుగు: అరకప్పు, కొత్తిమీర తురుము: టేబుల్‌స్పూను, పిండి ముద్ద: అంచుల్ని మూసేందుకు సరిపడా
తయారుచేసే విధానం:
అన్నం కాస్త పలుకు ఉండి పొడిపొడిలాడేలా వండి పక్కన ఉంచాలి.ఒకటిన్నర టేబుల్స్పూన్ల గోరువెచ్చని పాలలో కుంకుమపువ్వును కరిగించి అన్నంలో వేసి బాగా కలపాలి. తరవాత అన్నం రెండు సమ భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.నూనె వేసి సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిముక్కలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌లో సగం నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే పాన్‌లో లవంగాలు, యాలకులు, పలావు ఆకులు వేసి వేయించాలి. చిన్న ముక్కలుగా తరిగిన ఉల్లిముక్కలు, అల్లంవెల్లుల్లి వేసి వేయించాలి. ఇప్పుడు పుదీనా ముద్ద, కొత్తిమీర ముద్ద, బిర్యానీ మసాలా, ఉప్పు, కూరగాయల ముక్కలు వేసి కలపాలి. మీగడ, మిగిలిన పాలు పోసి ఉడికించాలి. తరవాత దించి చల్లారాక గిలకొట్టిన పెరుగు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసి పక్కన ఉంచాలి.మరో పాన్‌లో మిగిలిన నెయ్యి వేసి వేయించిన ఉల్లిముక్కలు పరిచినట్లుగా చల్లాలి. దానిమీద ఉడికించిన కూరగాయల మిశ్రమంలో ఒక భాగాన్ని పరచాలి. ఇప్పుడు దానిమీద అన్నంలో ఒక భాగాన్ని పరచాలి. తరవాత మళ్లీ ఉల్లిముక్కలు, కూరగాయల మిశ్రమం, అన్నం వరసగా పరచాలి. చివరగా మిగిలిన ఉల్లిముక్కలు, జీడిపప్పు, బాదం, ఎండుద్రాక్ష, కొత్తిమీర తురుము చల్లి మూతపెట్టి ఆవిరి బయటకు పోకుండా అంచుల్ని పిండితో మూసేసి అరగంటసేపు దమ్ చేయాలి. దీన్ని రైతాతో వడ్డిస్తే రుచిగా ఉంటుంది.